ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) ప్రకటన వెలువడింది. ప్రభుత్వం నిర్వహించే వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలల్లో (ప్రైవేటుతోసహా) టీచరుగా స్థిరపడాలనుకునేవారికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. టెట్‌లో సాధించిన మార్కులతో 20 శాతం వెయిటేజిని ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఇస్తారు. కాబట్టి సహజంగానే పోటీ ఎక్కువే ఉంటుంది. ఈ పరీక్ష ప్రాధాన్యం గుర్తించి అభ్యర్థులు సన్నద్ధతను కొనసాగించాలి!
పేపర్–1ఎ, 1బి:
- పేపర్–1ఎ: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు హాజరవ్వాల్సిన పేపర్.
- పేపర్–1బి: ఒకటి నుంచి అయిదో తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా బోధించాలనుకునే వారు హాజరవ్వాల్సిన పేపర్.
- పేపర్–1ఎ, పేపర్–1బిలను అయిదు విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు.
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ; లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. లాంగ్వేజ్–1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠి, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
PAPER – I(A) | A. CHILD DEVELOPMENT AND PEDAGOGY (30 MARKS) B.1 LANGUAGE – I TELUGU (30 MARKS) B.2 LANGUAGE – I URDU (30 MARKS) B.3 LANGUAGE – I HINDI (30 MARKS) B.4 LANGUAGE – I KANNADA (30 MARKS) B.5 LANGUAGE – I TAMIL (30 MARKS) B.6 LANGUAGE – I ODIA (30 MARKS) C. LANGUAGE – II ENGLISH (30 MARKS) D.MATHEMATICS (30 MARKS) E.ENVIRONMENTAL STUDIES (30 MARKS) |
PAPER – I(B) | CHILD DEVELOPMENT AND PEDAGOGY (SPECIAL EDUCATION) B.1 LANGUAGE – I TELUGU (30 MARKS) B.2 LANGUAGE – I URDU (30 MARKS) B.3 LANGUAGE – I HINDI (30 MARKS) B.4 LANGUAGE – I KANNADA (30 MARKS) B.5 LANGUAGE – I TAMIL (30 MARKS) B.6 LANGUAGE – I ODIA (30 MARKS) C. LANGUAGE – II ENGLISH (30 MARKS) D.MATHEMATICS (30 MARKS) E.ENVIRONMENTAL STUDIES (30 MARKS) |
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి
ఈ విభాగంలో శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్–కౌన్సెలింగ్ గురించి అధ్యయనం చేయాలి.
లాంగ్వేజ్–1,2
లాంగ్వేజ్–1లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో.. అదే విధంగా లాంగ్వేజ్–2గా పేర్కొన్న ఇంగ్లిష్‌లో భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధన పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ .. ఇలా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
పేపర్–1లో ఉండే ఈ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై ఒకటి నుంచి అయిదో తరగతి స్థాయి వరకు; పేపర్–2లో మ్యాథమెటిక్స్, సైన్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది. ఎన్విరాన్‌మెంటల్ పేపర్‌లో సైన్స్‌తోపాటు సమకాలీన అంశాలపైనా ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి అభ్యర్థులు ఏపీ ప్రాధాన్యం ఉన్న అంశాలను ప్రత్యేక దృష్టితో చదవడం లాభిస్తుంది.
కనీస అర్హత మార్కుల నిబంధన
టెట్‌లో.. అన్ని పేపర్లకు సంబంధించి కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో, బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.